Madhura BhaShaNam Nijamaina BhooShaNam(*మధుర భాషణం.. నిజమైన భూషణం*)| Telugu Moral Stories
*మధుర భాషణం.. నిజమైన భూషణం*
మాటే మంత్రము.. అవును.. మాట మంత్రమే కాదు.. మనకు, ఎదుటివారికి ఆనందాన్ని కలిగించే, కార్యసాధనకు ఉపకరించే అద్భుతమైన తంత్రం కూడా..!! పక్షులు కిలకిలా రావాలే చేయగలవు. కొన్ని జంతువులు భయంకరంగా గర్జించగలవు, కొన్ని జంతువులు జలదరించే తీరులో ఘీంకరించగలవు, కొన్ని జంతువులు కేవలం మొరగడం మాత్రమే చేయగలవు తప్ప మాట్లాడలేవు. ఏ జీవరాశికీ లేని వాక్కు అనే సంపద మానవులకు మాత్రమే ఉంది. వాక్కు అనేది మానవులకు భగవంతుడు ప్రసాదించిన అరుదైన వరం. అరుదుగా లభించినవాక్కు అనే వరాన్ని వివేచనతో, విచక్షణతో ఉపయోగిస్తూ, సందర్భోచితంగా సంభాషిస్తూ మన్నన పొందడం విజ్ఞత కలిగిన మానవుని లక్షణం.
ఒక మనిషిని సంఘంలో గౌరవించే విధానికి చాలావరకు మాటతీరు లేదా వాక్చాతురి కారణమౌతుంది. మృదువుగా సంభాషించే సౌజన్యశీలితో మాట్లాడడానికి సంఘంలో ఎవరైనా ఇష్టపడతారు. అహంకారాన్ని ప్రదర్శిస్తూ, ఎదుటివారిపై హుంకరిస్తున్న విధాన మాట్లాడితే, ఆ వ్యక్తి చెంత ఎవరూ చేరరు కదా..!! ‘‘మాట మంచిదైతే ఊరు మంచిదవుతుంది’’ అన్నది చిరకాలంగా మనకు తెలిసిన ఆర్యోక్తే కదా.. హితకరమైన మాటలు మాట్లాడే వ్యక్తి చాతుర్యం అన్ని సమయాల్లోనూ కార్యసాధకమై రాణిస్తుంది.
మృదుభాషణం కలిగినవారు తమ మాటలతో ఎదుటివారిని నొప్పించకుండానే తమకు కావలసింది సాధించుకుంటారని చరిత్ర ఘంటాపథంగా చెబుతోంది. అయితే, మాటతీరు అన్నివేళలా మృదువుగా ఉంటే సరిపోదు. సందర్భాన్ని బట్టి, ఒక్కొక్కసారి అవతలివారితో మనం సంభాషించే విధానంలో కొంత గట్టిగానూ మాట్లాడవలసి రావచ్చు. వాగ్గేయ శిరోమణి త్యాగరాజు చెప్పినట్లు ‘సమయానికి తగు మాటలాడి’ అన్నచందాన సంభాషించి, ఎదుటివారిని మెప్పించగలగాలి. అయితే, సంభాషణా వైఖరి వారిని గాయపరిచేది గానూ, నొచ్చుకునేదిగానూ ఉండ కూడదు. విషయం వారికి అర్థమై, మన మనోగతాన్ని వారు గుర్తెరగాలి. ఏది ఏమైనా తూటాలవంటి మాటలకంటే, తేనెలు నిండిన తేటలతో మాట్లాడే మాటలే మన గెలుపును శాసిస్తాయి. అందరితో మిత్రత్వాన్ని సాధిస్తాయి.
మనిషి మాటతీరు అతని చుట్టూ ఉండే మనుషులపై ప్రభావం చూపుతుంది. నోటినుంచి వచ్చే మాట ద్వారానే మనిషికీ మనిషికీ మధ్య సంబంధాలు ఏర్పడుతూ ఉంటాయి. మాటలతో మనం సాధించ వలసిన కార్యాన్ని కూడా సులువుగా సాధించవచ్చు. మృదుభాషి, మితభాషి అందరికీ అనాదిగా అలవాటున్న పదాలే! మృదుభాషి అంటే మృదువుగా మాట్లాడేవాడనీ, మితభాషి అంటే అవసరమైతేనేగానీ నోరు విప్పడనీ అందరికీ అవగతమే. అయితే, చిరకాలంగా, ఎంతోమందిని గొప్పవారిగా, సంస్కారవంతులుగా నిలబెట్టిన అరుదైన సంభాషణా లక్షణం మరొకటి ఉంది. వాళ్ళంతా పూర్వభాషిగా భాసించడమే వారికున్న ప్రత్యేక గుణం.
పూర్వభాషి అంటే, తానే ఎదుటివారితో చొరవ తీసుకుని ఆహ్లాదకరమైన తీరులో భాషించడం. ఎదుటివ్యక్తి తనకు అంతగా తెలియకపోయినా, ఎంతో చక్కటి వాక్కులతో అతన్ని ముందుగా మర్యాదగా పలకరించి, తరువాత అతనితో విషయాన్ని మృదువుగా వివరించడమే పూర్వభాషి లక్షణం. ఈ రకమైన మాటతీరు ఉన్నవారు అత్యంత ప్రతిభా వంతులుగా తమను తాము నిరూపించు కున్నట్లు చరిత్ర తెలియజేస్తోంది. ఆనాటి శ్రీరాముని నుంచి నేటి తరంలో విజయవంతమైన నాయకుల్లో అధిక శాతం పూర్వభాషులే. ఎటువంటి భేషజాన్నీ తనతో మాట్లాడేవారితో ప్రదర్శించని వ్యక్తిగా పూర్వభాషి గుర్తించబడతాడు.
కొన్ని సందర్భాల్లో మాట్లాడే మాటే ఎదుటివారి హృదయాన్ని రంజింపజేసి, వారిని జయించే మంజులమైన వశీకరణ మంత్రమూ అవుతుంది. ఎందుకంటే, మాట అత్యంత శక్తిమంతమైనది. నాలుకపై నడయాడే ప్రతి పదానికీ ఒక ప్రత్యేకత ఉంది. పొరపాటున కాలు జారితే వెనుకకు తీసుకోవచ్చు, కానీ అధాటున నోరు జారితే, ఆ మాటను వెనుకకు తీసుకో లేమన్నది సత్యమైన విషయమే కదా..!! మాట్లాడే విధాన్ని బట్టి అది ఎదుటివారి మానసాన్ని గెలిచే విజయ సూచికగా పనిచేయగలదు. ఎందుకంటే మాట అనేది మనసుని తాకుతుంది. అది సుతారంగా, ఎదుటివారిని గౌరవించేలా ఉండాలి గానీ, వారి మనోభావాలను గాయపరిచేదిగా ఉండకూడదు. మాటే మనిషికి అనుకోకుండా ఎదురైన కష్టాన్నీ పోగొడుతుంది.
ఎవరినైనా తప్పనిసరి పరిస్థితుల్లో సహాయం అడుగవలసి వచ్చినప్పుడు, వారితో లలితమైన రీతిలో సంభాషిస్తే, తోచినంత సహాయాన్నీ, తోడ్పాటును అవతలి వ్యక్తి మనకు అందించే అవకాశం ఉంది. అదేవిధంగా, మాటే మనిషికి కష్టాన్నికూడా తీసుకురావచ్చు. అహంకారంతో కూడిన సంభాషణా శైలి ఎప్పుడైనా సరే మనకు కష్టాలనూ తెచ్చిపెడుతుంది, మనకు శత్రువులనూ పెంచుతుంది. గొడ్డలితో నరకబడ్డ వృక్షమైనా మళ్ళీ చిగురిస్తుంది, కానీ, మాటలచేత మనసు ముక్కలైతే, మళ్ళీ పూర్వస్థాయిలో అనుబంధం పెరగదనేది ఋజువైన విషయమే కదా..
మనం మాట్లాడే మాట కోమలంగా ఉంటే ఎదుటివారి ఎదను పువ్వులా తాకుతుందని, అదే కటువుగా ఉంటే, కత్తిమొనలా వారిని గాయపరచి, వారితో ఉన్న స్నేహాన్నీ, సాన్నిహిత్యాన్నీ కూడా దూరం చేస్తుందన్న గౌతమ బుద్ధుని వాక్కులు అక్షర సత్యం. పదునైన ఈటెల పోటు కన్నా, కరుకైన మాటల పోటు ఎదుటివారి హృదయాలకు లోతైన గాయాన్ని చేస్తుంది. భారతదేశ ప్రధానిగా ఎన్నో విజయాలను సాధించిన ఘనులు లాల్ బహదూర్ శాస్త్రి. ఆయన ఎంతో ప్రతిభాశాలిగా ఎన్నో విజయాలను సాధించడంలో ఆయన సంభాషణాశైలి ఉపకరించిందని సన్నిహితులు చెబుతారు.
అమెరికా అధ్యక్షుల్లోనే అగ్రగణ్యునిగా వినుతికెక్కి, అప్రతిహత విజయాలను సాధించిన అబ్రహం లింకన్ కూడా మృదుభాషేనన్న విషయం గమనార్హం. మనిషి ఉత్థాన పతనాలను వారు మాట్లాడే మాటలే శాసిస్తాయి. ఉత్తమరీతిలో జీవన ప్రస్థానం సాగడానికి మంచి ఉపకరణంగా భాసిస్తాయి. నాలుకపై మాట్లాడే ప్రియమైన మాటలు అందరికీ సంతోషాన్ని కలిగిస్తాయి. మనల్ని మెచ్చుకునేలా చేస్తాయి. మనిషికి నలుగురిలో గౌరవాన్ని సంతరించేది సమయోచిత భాషణం..!! అదే, అందరినీ సన్నిహితులను చేసి, అలరించే విలువైన భూషణం.
Home Page Learn Telugu Learn English YouTube Videos Telugu Moral Stories
Telugu Christian Songs Lyrics Computer Shortcut Keys