Aayatagaallu(ఆయతగాళ్లు) | Telugu Moral Stories

Aayatagaallu(ఆయతగాళ్లు) | Telugu Moral Stories

 

అరణం అంటే కానుక. భక్తులు తమ శక్తి కొద్దీ భగవంతుడికి మడులు మాన్యాలు ధనరాశులు… ఇంకా ఎన్నో విలువైన ఆభరణాలు సమర్పిస్తారు. ఈ అరణాలు, ఆభరణాలు సద్వినియోగం కావాలని వారి కోరిక. దేవాలయ నిర్వాహకులు వాటిని ధర్మకార్యాలకు వినియోగిస్తే తరాల తరబడి తరిస్తామని భక్తుల విశ్వాసం. పూర్వకాలంలో ఆలయాలలో ధూప దీప నైవేద్యాది కైంకర్యాలకు వేలాది ఎకరాలను భక్తులు కానుక చేసిన వైనం చరిత్రలో కనిపిస్తుంది. స్థల పురాణాల్లో వినిపిస్తుంది. ఏదైనా ఘనకార్యం సాధించినవారి గురించి చెబుతూ మనవాళ్లు ‘అదంతా వారి పెద్దల పుణ్యం’ అంటూంటారు.

 

అసాధారణమైన కృషితో అనితరసాధ్యమైన పట్టుదలతో గంగానదిని ఆకాశాన్నుంచి నేలకు దించాడు భగీరథుడు. ‘మీ వంశంలో ఎవరూ సాధించలేకపోయినదాన్ని సాధించి చరితార్థుడవయ్యావు’ అని బ్రహ్మదేవుడు ప్రశంసిస్తుంటే భగీరథుడు నవ్వి ‘ఇది మా పెద్దల పుణ్యఫలం’ అన్నాడు రామాయణంలో! ధర్మకార్యం పట్ల ఆసక్తి చూపించే వారందరిదీ ఇదే భావన. తమ పెద్దల పుణ్యం తమకు కలిసొచ్చింది… దీన్ని రాబోయే తరాలకు అందించాలి అనే అమృత భావనే ఈ జాతి జనులను ధర్మపరులను చేసింది. పుణ్యకార్యాలకు ప్రేరేపించింది. గ్రామాల్లో వాటి చిహ్నాలు ఇప్పటికీ స్పష్టంగా గోచరిస్తాయి. సత్రాలు కట్టించడం, ఆలయాలు నిర్మించడం, అన్న దానాలు జరిపించడం… వాటి నిర్వహణ నిమిత్తం శాశ్వత నిధులను సమకూర్చడం వంటి ఎన్నో సత్కార్యాలకు ఆ దాన శాసనాలు సాక్ష్యం చెబుతాయి.

 

దేవుడి సొమ్మును అక్రమ మార్గాలకు మళ్ళించేవాడిని ‘ఆయత గాడు’ అన్నాడు ఆముక్త మాల్యదలో శ్రీ కృష్ణదేవరాయలు. దేవాలయ నిర్వహణను ఎట్టి పరిస్థితుల్లోనూ ఆయతగాడి చేతికి అప్పగించరాదని ‘యామున రాజనీతి’లో స్పష్టం చేశాడు. స్వార్థ ప్రయోజనానికే కాదు, నీరసపడిన రాజుగారి బొక్కసానికి బలం చేకూర్చడానికైనా సరే, దేవుడి ధనం వినియోగించరాదని ఆయన శాసించాడు. దానివల్ల ధర్మహాని జరుగుతుందని హెచ్చరించాడు.

ఆలయ అధికారులుగా మంత్రులుగా ఎలాంటివారిని నియమించాలో ఆముక్తమాల్యద విస్పష్టంగా ప్రకటించింది. మన ధర్మశాస్త్రాలన్నింటా ఈ విషయంలో పాటించవలసిన నియమాల్ని పొందుపరచారు. ‘పెడితే పెళ్ళి- పెట్టకపోతే శ్రాద్ధం’ అన్న తీరులో వ్యవహరించేవారు ఆలయ అధికారులుగా పనికి రారన్నారు. అలాగే మంత్రులు! ‘అమా’ అనే మాటకు కలిసి ఉండటమని అర్థం. రాజు గారి మనసుకు అత్యంత సమీపంగా ఉండేవాడు అమాత్యుడు. దేవాదాయమంటే దేవుడికిచ్చిన అరణమని అర్థం. ఆ శాఖకు మంత్రిగా ఉండేవారు భక్తుల మనోభావాలకు దగ్గరగా ఉండాలి. దాతల ఆశయ సాధనకు అంకితం కావాలి. అంతేగాని దేవాలయాలను ప్రభుత్వానికి ఆదాయ వనరులుగా భావించేవారు ఆ శాఖకు మంత్రులుగా తగరన్నది మన పెద్దల నిర్దేశం. రాజకీయ నిరుద్యోగులను ధర్మకర్తలుగాను, ఆయతగాళ్లను ఆ శాఖకు అధికారులుగాను నియమిస్తే ధర్మానికి గ్లాని, రాజ్యానికి హాని తప్పవన్నది మన ధర్మశాస్త్రాల నిర్దేశం!

 

తాము చేసే మంచి పనుల వల్ల నలుగురికీ మేలు జరగాలన్నది ఒక్కటే దాతల పరమలక్ష్యం. అలా సమకూరిన ఆస్తిపాస్తులను ఆలయ నిర్వాహకులు దాతల ఆశయాలకు అనుగుణంగా సక్రమ మార్గంలో వినియోగించినప్పుడే ఆ లక్ష్యం నెరవేరుతుంది. అలా కాకుండా ప్రభుత్వాలు గాని ఆలయ అధికారులు గాని వాటిని వేరే ప్రయోజనాలకు వినియోగిస్తే దాతల ఆశయాలకు తూట్లు పడటమే కాదు, ప్రజల మనోభావాలు దెబ్బతింటాయి. దానం చేయాలన్న బుద్ధి మాసిపోవడం అన్నింటికన్నా పెద్ద ప్రమాదం.

 

Home Page    Learn Telugu    Learn English    YouTube Videos    Telugu Moral Stories

Telugu Christian Songs Lyrics     Computer Shortcut Keys

Add a Comment

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!