Tulasi (తులసి) | Telugu Moral Stories
Tulasi (తులసి)
‘తులసి’ అన్న పదాన్ని మనం వివేచన చేస్తే ‘తులాంస్యతి తులసి’. ‘తుల’ అంటే ‘వెల కట్టడం’ అని అర్థం. వెల కట్టడానికి వీలు లేనిది తులసి. ‘తులస్యంమృత జన్మాసి’ అని కీర్తింపబడే తులసిని పరమపూజ్యమైందిగా భావిస్తాం. దీన్ని మహాలక్ష్మీ స్వరూపంగా ‘పద్మపురాణం’లో వ్యాసమహర్షి చెప్పాడు. ఇది విష్ణుకామిని. కృష్ణభూషణ రూప. విష్ణుపాద స్థల నివాసిని. తపఃస్సంకల్ప పూజాదులను సిద్ధింపజేసే శక్తి కలది.
కలియుగంలో కాలుష్యాలను దహించే అగ్ని. దేవతల తృప్తి కోసం మహర్షులు తపస్సు చేసి ఈ వృక్షాన్ని పొందగలిగారు. అందుకే, ఇది కోరికలు తీర్చగలిగే మన పాలిటి కల్పవృక్షం. గంగ ఎంత పవిత్రమో తులసి కూడా అంతే పవిత్రమైంది. కృష్ణ తులసి, లక్ష్మీ తులసి, విష్ణు తులసి, రామ తులసి అని వివిధ రకాలుగా పిలుస్తున్నా వాటి గొప్పతనం, పవిత్రత మాత్రం ఒక్కటే. ‘తులసి లేని ఇంట పితృకర్మ, దైవకర్మ లేవి చేసినా ఫలించవు’ అన్నది శాస్త్రం.
తులసి ఉన్నచోటికి దేవతలైనా, పితృదేవతలైనా ఆనందంగా వస్తారట. అంతేకాక, ఇది ఉన్నచోటకు దుష్టశక్తులు రావు. ఎందుకంటే, ఇది సాక్షాత్తూ ‘అమ్మవారి ప్రధానాంశ’ అని ‘దేవీ భాగవతం’ చెప్తున్నది. పువ్వులన్నిటి సారం తులసి. భూమ్మీద దొరికే పుష్పాలన్నిటి సారమంత విశేషమైన, పవిత్రమైంది ఇది. అంతటి పుణ్యదాయిని కూడా. దీన్ని దర్శించినా, స్పర్శించినా ముక్తిని, శక్తిని ప్రసాదిస్తుంది. భారతీయ సాంప్రదాయం, సనాతన ధర్మాన్ని అనుసరించి తులసి మొక్క లేని గృహం ఉండదు.
మనం ప్రకృతిని దైవంగా భావించి వృక్షాలన్నిటినీ దైవాలుగానే భావించినా ప్రత్యేకించి తులసి మొక్కను ఇంటి వద్ద తులసికోటలో పెంచి ధూపదీప నైవేద్యాలతో పూజించటం ఒక ప్రత్యేకత. దీనిని ‘కోట’గా ఎందుకంటామంటే, కోట ఎలాగైతే రక్షణనిస్తుందో ఇదీ అలాంటిదని నమ్మకం. ఇంటి గుమ్మం ముందు నుంచి చూస్తే పెరట్లో పెట్టిన తులసికోట కనపడాలని, ఉదయం నిద్ర లేవగానే తులసిని చూడాలన్నది అనాదిగా వస్తున్న ఆచారం. ఆధునిక ఇండ్ల నిర్మాణంలో అది సాధ్యం కాకపోయినా చిన్న కుండీలలోనైనా తులసి చెట్టు ఉండటం మాత్రం ప్రతి ఇంట్లోనూ చూస్తున్నాం. ఈ విధంగా ఇప్పటికీ తులసి మొక్కలు కనపడుతున్నాయంటే అది మన ప్రాచీన ఋషుల తపఃఫలమే.
తులసి మూలంలోని మట్టికి ఉన్న శక్తి ఎంతో గొప్పది. తులసీ మృత్తిక (మట్టి)కు ‘గోపీ చందనమని’ వ్యవహారం. దీన్ని బొట్టుగా పెట్టుకుంటే పవిత్రమని, దివ్యత్వమని అంటారు. తులసి మూలంలో సర్వతీర్థాలున్నాయని, మూలంలో నీళ్లు పోసి తలపై చల్లుకుంటే తీర్థస్నాన ఫలితం కలుగుతుందని ‘విష్ణు పురాణం’ చెబుతున్నది.
మన దేశంలోని తులసి, మారేడు వంటి వృక్షజాతి, గోజాతి సామాన్యమైనవి కావు. మనిషి తుదిఘడియలో ‘తులసీ తీర్థం నోట్లో పోయడం’ అంటే తిరిగి ప్రాణాన్ని పుంజుకుంటాడేమోనని ఆశ. అంత ఔషధీయుతమైన తులసి చెట్టు అత్యధిక ప్రాణవాయువును ప్రసరింపజేస్తూ ఆ గాలి పీల్చిన వారికి దీర్ఘాయుర్దాయాన్ని కలిగిస్తుంది. తులసి చెట్టు వద్ద సంధ్యావేళ దీపం పెట్టడం మోక్షదాయకం.
అటువంటి ఇంటికి ఐష్టెశ్వర్యాలు లభిస్తాయి. వేదవాక్యంలోని అంతరార్థం తెలిపే తులసిని పెంచి పూజించడం నిజమైన భారతీయాత్మకు ప్రతీక. మన సంస్కృతీ సంరక్షణలో భాగంగా, ఆచారాలు అనుసరించడంలో అంతర్భాగంగా తులసీ మాతను భక్తితో అర్చిద్దాం.
Home Page Learn Telugu Learn English YouTube Videos Telugu Moral Stories
Telugu Christian Songs Lyrics Computer Shortcut Keys